పిల్లల్ని పెంచడం అనేది ఒక కఠోర సాధన. అందుకు ఎంతో సహనం కావాలి. మన ఎన్నో త్యాగాలు చెయ్యాలి. సహనం, త్యాగం అంటే వారి కోసం మాత్రమే చేసేవి కాదు. మనల్ని మనం ఎన్నో విషయాలలో నిగ్రహించుకోగాలగాలి. ఎన్నింటినో వదులుకోగలగాలి.
పిల్లలు తప్పక తల్లిదండ్రులైన మనల్ని అనుసరిస్తారు. అనుకరిస్తారు. వారికి ప్రత్యక్ష ఉదాహరణ మనమే. మనం ఏం చేస్తే వారూ అదే చెయ్యవచ్చుననుకుంటారు. అందులో మంచిచెడులు వారికి అనవసరం. మనం చేసేం కాబట్టి వారు కూడా చేస్తే చెల్లుబాటవుతుందనుకుంటారు.
మనం ఒకరిని కసురుకోవడం, చికాకు పడటం, సంతోషం, దుఃఖం, నిరాశ, నిస్పృహ, వివిధ విషయాలలో మన భావోద్వేగాలు - వీటన్నింటి విషయంలో మనల్ని ఉదాహరణలుగా అనుకరించాలనుకుంటారు పిల్లలు. కాబట్టి వీటన్నింటి పట్ల మనం సహనం వహించాలి. దానర్థం పిల్లల పట్ల మనం సహనంతో ఉండటం కాదు. మన భావావేశాలు వారి ఎదుట వ్యక్తం కాకుండా మనం సంయమనం పాటించగలగాలి.
అలాగే మనలోని అనేక చాంచల్యాలను - వాక్, దృక్, రస, శ్రవణ, స్పర్శ, మనో, బుద్ధి చాంచల్యాలను - పూర్తిగా త్యజించగలగాలి. మనం చేసేవే పిల్లలకు పాఠాలుగా ఉంటాయి కదా.
పిల్లల్ని ఆదర్శమూర్తులుగా తీర్చిదిద్దాలంటే వారి ముందు సజీవ ఉదాహరణలుగా నిలబడే మనం నిత్యం త్యాగము, సహనములను ప్రయత్నపూర్వకంగా సాధన చేస్తూ జీవితాన్ని ఒక కఠోర తపస్సుగా జీవించాలి.
From
D.Kishore gaaru
No comments:
Post a Comment